101 రోజుల ‘తెలంగాణ ప్రజాకళ’ మహోత్సవాలు ఘనంగా ముగింపు – ఆవిష్కృతమైన మూడు విశిష్ట గీతాలు

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి పాల్కురికి సోమన్న మూలవేదికపై 2026 ఏప్రిల్ 1న ప్రారంభమైన “తెలంగాణ ప్రజాకళ” 99 రోజుల సాంస్కృతిక మహోత్సవాలు ప్రేక్షకుల అపూర్వ ఆదరణతో మరో రెండు రోజులు పొడిగించబడి, శుక్రవారం 101వ రోజుతో అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు నెలలకు పైగా నిరంతరాయంగా సాగిన ఈ మహోత్సవాలు తెలంగాణ జానపద కళా వైభవాన్ని దేశానికి చాటిచెప్పడమే కాకుండా, కళాకారులకు అపూర్వ వేదికగా నిలిచి రాష్ట్ర సాంస్కృతిక చరిత్రలో ఓ విశిష్ట అధ్యాయాన్ని లిఖించాయి.
ముగింపు వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళారూపాల సజీవ రూపాన్ని ఆవిష్కరించాయి. గుస్సాడి, చిందు యక్షగానం, ఒగ్గుడోళ్ళ విన్యాసాలు, మహిళా డప్పు కళారూపం, బంజారా నృత్యం, బోనాల నృత్యం, డప్పుల విన్యాసాలు, కోలాటం తదితర జానపద కళాబృందాలు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏజీ ఆఫీస్ నుంచి రవీంద్రభారతి వరకు అంగరంగ వైభవంగా నిర్వహించిన కళాత్మక ఊరేగింపులో పాల్గొని నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. రంగురంగుల సంప్రదాయ వస్త్రధారణ, జానపద వాద్యాల నినాదాలు, కళాకారుల ఉత్సాహభరిత ప్రదర్శనలతో రవీంద్రభారతి పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
జానపద గేయాలు, సామాజిక చైతన్య గీతాలు, తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ పథకాల ప్రచార గీతాలు, సంప్రదాయ నృత్య విన్యాసాలు వరుసగా అలరించగా, కళాభిమానుల కరతాళధ్వనులు, హర్షధ్వానాలతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. ప్రతి ప్రదర్శనకు ప్రేక్షకులు విశేష స్పందన తెలుపుతూ కళాకారులను అభినందించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (యువజనాభ్యుదయం, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ) శ్రీమతి వాణీ ప్రసాద్, IAS మాట్లాడుతూ, “ఎక్కడైతే కవులు, కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది” అని పేర్కొన్నారు. కళలు సమాజానికి స్ఫూర్తినిచ్చే శాశ్వత శక్తి అని, తెలంగాణ ప్రభుత్వం జానపద కళల పరిరక్షణ, కళాకారుల సంక్షేమం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా “ప్రజాకవిత” గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి, IAS రచించిన హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ఆవిష్కరించే “ముద్దొచ్చె ముద్దొచ్చె హైదరాబాదు” గీతాన్ని ప్రముఖ జానపద గాయకుడు విద్యానందాచారి ఆలపించిన సీడీని ఆవిష్కరించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రభాతభేరి” కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో విద్యానందాచారి రచించి ఆలపించిన “మత్తులోన మునగకురా మాయదారి మల్లిగా” సామాజిక చైతన్య గీతాన్ని విడుదల చేశారు. అనంతరం “ప్రజాకళ గీతం” ను ఆవిష్కరించారు. ఈ మూడు విశిష్ట గీతాలు, “ప్రజాకవిత” గ్రంథం సభలో విశేష ప్రశంసలు అందుకొని, ప్రేక్షకుల మన్ననలు పొందాయి.
ఈ కార్యక్రమానికి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి, IAS సభాధ్యక్షత వహించగా, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డా. జి.వి. వెన్నెల పాల్గొని కళాకారులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది కళాకారులు, సాహితీవేత్తలు, సంగీత విద్వాంసులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు, కళాభిమానుల సమక్షంలో ముగింపు వేడుకలు కనులపండువగా సాగాయి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళారూపాల పరిరక్షణ, ప్రోత్సాహం, భావితరాలకు వాటి వారసత్వాన్ని చేరవేయాలనే మహత్తర లక్ష్యంతో నిర్వహించిన 101 రోజుల “తెలంగాణ ప్రజాకళ” మహోత్సవాలు రాష్ట్ర సాంస్కృతిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచే సువర్ణ ఘట్టంగా నిలిచాయని కళాకారులు, సాహితీవేత్తలు, సాంస్కృతిక రంగ ప్రముఖులు, ప్రేక్షకులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. తెలంగాణ జానపద కళలకు నూతనోత్సాహాన్ని నింపిన ఈ మహోత్సవాలు కళా–సాంస్కృతిక చైతన్యానికి చిరస్మరణీయ నాందిగా నిలిచాయని వారు కొనియాడారు.

