కొత్తగూడెం (లీగల్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి యం. రాజేందర్ గారి ఆదేశాల మేరకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చల్లగాలి సాహితి చుంచుపల్లి హైస్కూల్లో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, అంతర్జాతీయ బాలికా దినోత్సవాల ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. మానసిక ఒత్తిడిని అధిగమించడం, ఆత్మవిశ్వాసంతో ఉండటం, సమస్యలను పెద్దలతో పంచుకోవడం వంటి అంశాలను వివరించారు. బాలికల విద్య, సమాన హక్కులు, భద్రత, సాధికారతపై అవగాహన కల్పించారు.
అలాగే పోక్సో చట్టం–2012, బాల్య వివాహాల నిరోధక చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై వివరించి, బాలల హక్కులను పరిరక్షించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
