22 జూలై 2026 : తెలంగాణ అగ్రికల్చర్ & ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ తరఫున శ్రీ కె.వి.ఎన్. రెడ్డి గారు కీలక సూచనలు
హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ డా. జి. చిన్నారెడ్డి అధ్యక్షతన, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డా. గోపి కన్వీనర్‌గా ఎల్ నినో పరిస్థితులు, వాటి ప్రభావం మరియు రాష్ట్ర స్థాయి కంటింజెన్సీ కార్యాచరణ ప్రణాళికపై నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ అగ్రికల్చర్ & ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ తరఫున శ్రీ కె.వి.ఎన్. సర్ ప్రత్యేక ఆహ్వానితులుగా (Special Invitee) పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీ కె.వి.ఎన్. రెడ్డి సర్ మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కంటింజెన్సీ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పంటల మార్పిడి (Crop Diversification) ద్వారా తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ప్రోత్సహించాలని, రైతులకు వాతావరణ ఆధారిత సాంకేతిక సలహాలు సకాలంలో అందించాలని సూచించారు.
వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఇంకుడు గుంటలు (Farm Ponds), చెక్‌డ్యాంలు, వర్షపు నీటి సంరక్షణ చర్యలను విస్తృతంగా చేపట్టాలని, భూగర్భ జలాలను పరిరక్షించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఎల్ నినో ప్రభావం వల్ల పశుసంపదకు ఇబ్బందులు తలెత్తకుండా పశుగ్రాస ఉత్పత్తి, నిల్వ మరియు పంపిణీకి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఉద్యానవన రంగం రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంటూ, ఉద్యాన శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి, ఇంకా కొత్త నియామకాలు చేపట్టాలని తగిన సాంకేతిక మరియు ఫీల్డ్ స్థాయి సిబ్బందితో శాఖను బలోపేతం చేయాలని సూచించారు. అలాగే సూక్ష్మ నీటిపారుదల, మల్చింగ్ వంటి నీటి పొదుపు సాంకేతికతలను విస్తృతంగా ప్రోత్సహించాలని అన్నారు.
వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, నీటిపారుదల, వాతావరణ శాఖలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు ఇతర సంబంధిత సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసి, రైతులకు సకాలంలో మార్గదర్శకాలు అందించి ఎల్ నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే కార్యాచరణను అమలు చేయాలని శ్రీ కె.వి.ఎన్. రెడ్డి సర్ సూచించారు.
కమిషన్ తరఫున చేసిన ఈ సూచనలను సమావేశంలో పాల్గొన్న సభ్యులు సానుకూలంగా స్వీకరించగా, రాష్ట్ర స్థాయి కంటింజెన్సీ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
