ప్రకటన న్యూస్ ప్రతినిధి : బి. అనిత : హైదరాబాద్, 16 జులై, 2026 : శ్రీకాకుళంలో జూలై 11, 12 తేదీల్లో నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్–2026లో మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన 11 ఏళ్ల సాన్వి లట్టాల అపూర్వమైన చరిత్ర సృష్టించింది.
అండర్-13, అండర్-15, అండర్-17 బాలికల సింగిల్స్ విభాగాల్లో వరుసగా విజేతగా నిలిచి మూడు స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. ఒకే జిల్లా ఛాంపియన్‌షిప్‌లో ఈ మూడు విభాగాల్లో విజేతగా నిలిచిన మొట్టమొదటి బాలికగా సాన్వి జిల్లా బ్యాడ్మింటన్ చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిపింది.

ఇంకా విశేషమేమిటంటే, టోర్నమెంట్ మొత్తం ఒక్క మ్యాచ్‌లో కూడా ఒక్క సెట్‌ను కూడా కోల్పోకుండా అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
ఫైనల్ ఫలితాలు:
అండర్-13 బాలికల సింగిల్స్ ఫైనల్ సాన్వి లట్టాల – రామ కేతనపై విజయం స్కోరు: 15-8, 15-7
అండర్-15 బాలికల సింగిల్స్ ఫైనల్ సాన్వి లట్టాల – చిత్రి జ్యోత్స్నపై విజయం స్కోరు: 15-6, 15-9
అండర్-17 బాలికల సింగిల్స్ ఫైనల్ సాన్వి లట్టాల – మోక్షిత నందినిపై విజయం స్కోరు: 15-7, 15-8
ఈ అద్భుత విజయంతో సాన్వి లట్టాల త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించే అర్హత సాధించింది.
టోర్నమెంట్ ముగింపు సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఐఏఎస్ గారు, శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సాగర్ గారు, చైర్మన్ శ్రీ రాజేంద్రన్ గారు, సీఈఓ శ్రీ సూరిబాబు గారు ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు.
ఈ సందర్భంగా అతిథులు సాన్వి లట్టాల సాధించిన అరుదైన విజయాన్ని అభినందిస్తూ, రాష్ట్ర స్థాయిలోనూ ఇదే విజయపరంపర కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ గ్రూప్ వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్ శ్రీ వేణు ముప్పాల మాట్లాడుతూ, “కేవలం 11 ఏళ్ల వయస్సులోనే మూడు వేర్వేరు విభాగాల్లో జిల్లా ఛాంపియన్‌గా నిలిచి, ఒక్క సెట్ కూడా కోల్పోకుండా చరిత్ర సృష్టించడం ఎంతో గర్వకారణం. సాన్వి విజయం ఆమె కృషి, క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనం. మా అకాడమీ లక్ష్యం జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్లను తయారు చేయడం. సాన్వి విజయం ఆ లక్ష్యానికి తొలి అడుగు మాత్రమే. భవిష్యత్తులో మరెందరో క్రీడాకారులు ఇలాంటి విజయాలు సాధించి శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు కీర్తి” తీసుకురావాలని కోరారు.

సాన్వి లట్టాల సాధించిన ఈ చారిత్రాత్మక త్రిబుల్ గోల్డ్ విజయం శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా యువ బ్యాడ్మింటన్ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
