
ఏజెన్సీ ప్రాంతాల్లో కుటుంబాలకు తప్పనిసరిగా 125 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలి
రాబోయే ఐదు నెలల్లో ప్రతి జాబ్‌కార్డుకు నెలకు కనీసం రూ.7,500 వేతనం అందేలా లక్ష్యం
గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించాలి
చిట్టచివరి గ్రామంలోని చిట్టచివరి వ్యక్తి అభివృద్ధి చెందడమే నిజమైన సమగ్ర అభివృద్ధి– మంత్రి సీతక్క
హైదరాబాద్, అక్టోబర్ 15: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత, ఉపాధి సమస్యలు, పశువులకు పశుగ్రాసం కొరత వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఆదివాసి గిరిజన కుటుంబానికి కనీసం 125 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలని స్పష్టం చేశారు.
బేగంపేటలోని హోటల్లో గురువారం VB-G RAM G ద్వారా ఎల్‌నినో కరువు నివారణ చర్యలపై నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సుకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్‌తో పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, సబ్ కలెక్టర్లు, ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అదనపు డీఆర్డీఓలు, పీఓలు, ఎంపీడీఓలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ప్రజల అభివృద్ధే గ్రామ అభివృద్ధి
గ్రామపంచాయతీల పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధే గ్రామ అభివృద్ధి అని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి జీవనోపాధి, కనీస మౌలిక సదుపాయాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
“చిట్టచివరి గ్రామంలోని చిట్టచివరి వ్యక్తి అభివృద్ధి చెందడమే నిజమైన సమగ్ర అభివృద్ధి” అని మంత్రి స్పష్టం చేశారు. మారుమూల గిరిజన గ్రామాలు కూడా ఇతర గ్రామాలతో సమానంగా అభివృద్ధి చెందేలా అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గతంలో ఆదివాసి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం వివిధ శాఖల సమన్వయంతో చేపట్టిన కార్యక్రమాల స్ఫూర్తితో, ప్రస్తుతం కూడా ఐటీడీఏలు, పంచాయతీరాజ్ శాఖ, పేదరిక నిర్మూలన సంస్థ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
వర్షపాతం లోటు నేపథ్యంలో ముందస్తు చర్యలు
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 16 నుంచి 18 జిల్లాలు సాధారణ వర్షపాతం కంటే 20 శాతానికి పైగా లోటుతో ఉన్నాయని సదస్సులోని నివేదిక పేర్కొంది. 18 జిల్లాల పరిధిలోని 320 మండలాలల్లో తీవ్ర ఎల్‌నినో ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిందని వివరించింది. ఈ సీజన్లో ఎల్‌నినో పరిస్థితులు మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
రాష్ట్రంలో వర్షపాతం లోటు ఉన్నప్పటికీ ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సాధారణంగా వేసవి ప్రభావం మూడు నెలలకే పరిమితమవుతుందని, అయితే ఈసారి దాదాపు ఎనిమిది నెలలపాటు వేసవి తరహా పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా నీటి సంరక్షణ, ఉపాధి కల్పన, పశుగ్రాసం అభివృద్ధి వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఆదివాసీ గిరిజన కుటుంబాలకు 125 రోజుల ఉపాధి కల్పించాలి
ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యవసాయం ప్రధానంగా ఒకే పంటకు పరిమితమవుతుందని, రెండో పంట సాగు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని మంత్రి వివరించారు. దీంతో ఆదివాసి గిరిజన కుటుంబాలకు ఆదాయ భద్రత కల్పించడంలో ఉపాధి హామీ పథకం కీలకమని పేర్కొన్నారు.
ప్రతి ఆదివాసీ గిరిజన కుటుంబానికి తప్పనిసరిగా 125 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలని, ప్రతి కుటుంబానికి జాబ్‌కార్డు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే ఐదు నెలల్లో ప్రతి జాబ్‌కార్డుకు నెలకు కనీసం రూ.7,500 వేతనం లభించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సదస్సులో స్పష్టం చేశారు.
ప్రతి ఆదివాసి గిరిజన నివాస ప్రాంతంలో కనీసం ఒక మేట్‌ను నియమించాలని, వేతనాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధి పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
ఉపాధి పనులతో గ్రామాలకు శాశ్వత ఆస్తులు
ఉపాధి హామీ పథకం కింద కేవలం కూలీలకు పని కల్పించడమే కాకుండా, గ్రామాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే శాశ్వత ఆస్తులను సృష్టించాలని మంత్రి సీతక్క సూచించారు. ఉపాధి హామీ కింద అందుబాటులో ఉన్న 370 రకాల పనులను గ్రామాల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని అన్నారు.
మట్టి, మొరం రహదారులు, గ్రామాలకు వెళ్లే బాటలు, అన్ని కాలాల్లో వినియోగించుకునే రహదారులు, ఊట చెరువులు, పెర్కొలేషన్ ట్యాంకులు, చెరువుల్లో పూడికతీత, కాలువలు, ఫీడర్ ఛానళ్లు, కందకాల తవ్వకం వంటి పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణ పనుల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు వ్యవసాయం, పశుపోషణకు అవసరమైన వనరులను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు.
పశుసంపదకు నీరు, పశుగ్రాసం అందేలా చర్యలు
ఏజెన్సీ ప్రాంతాల్లో పశుసంపద ఎక్కువగా ఉంటుందని పేర్కొన్న మంత్రి, పశువులకు అవసరమైన నీరు, పశుగ్రాసం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణం, నీటి సంరక్షణ పనులు చేపట్టి వర్షపు నీటిని ఒడిసిపట్టాలని అన్నారు. ఉపాధి హామీ పనులను స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తే గ్రామాల అభివృద్ధితో పాటు కరువు ప్రభావాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
గ్రామాల్లో పర్యటిస్తేనే ప్రజల సమస్యలు తెలుస్తాయి
అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా నిరంతరం గ్రామాల్లో పర్యటించాలని మంత్రి సీతక్క సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు తెలుస్తాయని, వాటికి తగిన పరిష్కారాలు కనుగొనగలమని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
అటవీ సంబంధిత అడ్డంకులు, ఇతర క్షేత్రస్థాయి సమస్యలను అధికారులు తమ దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన మార్గదర్శకాలు అందించి, గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించాలని సూచించారు.
శాఖల సమన్వయంతో ఎల్‌నినోను ఎదుర్కోవాలి
పంచాయతీరాజ్ శాఖ, ఐటీడీఏలు, పేదరిక నిర్మూలన సంస్థలు సమన్వయంతో పనిచేసి ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవాలని మంత్రి పిలుపునిచ్చారు. సర్పంచులు, క్షేత్రస్థాయి సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులను భాగస్వాములను చేస్తూ ఉపాధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
అందుబాటులో ఉన్న నిధులను సమర్థంగా వినియోగించుకుంటూ మారుమూల గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అన్నారు. ఉపాధి కల్పనతో పాటు నీటి సంరక్షణ, పశుగ్రాసం అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి, ప్రతి గ్రామంలో అవసరమైన పనులు చేపట్టి, ప్రతి పేద కుటుంబానికి ఉపాధి భరోసా కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
