• గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేరితే మెరుగైన చికిత్సకు అవకాశం
• యువతలోనూ పెరుగుతున్న స్ట్రోక్ ముప్పు.. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం ప్రధాన కారణాలు
• ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్ వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 28, 2026: పక్షవాతం (స్ట్రోక్) లక్షణాలను సకాలంలో గుర్తించకపోవడం, ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం చేయడం వల్ల రోగులు విలువైన చికిత్స సమయాన్ని కోల్పోతున్నారని కేర్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరించారు. అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పక్షవాతం లక్షణాలు, అత్యవసర చికిత్స, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ ఏడాది ‘ఎవ్రీ మినిట్ కౌంట్స్’ (ప్రతి నిమిషం కీలకమే) అనే నినాదంతో స్ట్రోక్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
మెదడులోని ఒక భాగానికి రక్తప్రసరణ నిలిచిపోవడం లేదా రక్తనాళం చిట్లిపోవడం వల్ల పక్షవాతం వస్తుంది. రక్తసరఫరా అందకపోతే మెదడు కణాలు దెబ్బతినడం ప్రారంభమవుతుంది. ఫలితంగా కాళ్లు, చేతులు పనిచేయకపోవడం, మాట పడిపోవడం, చూపు మందగించడం, జ్ఞాపకశక్తి దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. సాధారణంగా వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య యువతలోనూ వచ్చే ప్రమాదముందని వైద్యులు తెలిపారు.
గోల్డెన్ అవర్ దాటినా చికిత్సకు అవకాశాలు
పక్షవాతం లక్షణాలు ప్రారంభమైన తొలి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారు. ఈ సమయంలో ఆసుపత్రికి చేరుకోవడం అత్యంత కీలకం. అయితే గంట దాటితే చికిత్సకు అవకాశం ఉండదనుకోవడం పొరపాటని వైద్యులు స్పష్టం చేశారు. రక్తనాళంలో గడ్డకట్టడం వల్ల వచ్చే ఇస్కీమిక్ స్ట్రోక్‌లో అర్హులైన రోగులకు లక్షణాలు ప్రారంభమైన 4.5 గంటల్లోపు రక్తపు గడ్డను కరిగించే మందులు ఇవ్వవచ్చు. ఎంపిక చేసిన రోగుల్లో వైద్య పరీక్షలు, బ్రెయిన్ స్కాన్ ఫలితాల ఆధారంగా 24 గంటల వరకు మెకానికల్ థ్రాంబెక్టమీ ద్వారా గడ్డను తొలగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయం ఉందని వేచి చూడకుండా వెంటనే ఆసుపత్రికి చేరుకోవాలని సూచించారు.
ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం
ముఖం ఒకవైపు వాలిపోవడం, చేయి లేదా కాలు అకస్మాత్తుగా బలహీనపడటం, మాట తడబడటం, చూపు మందగించడం, నడకలో తూలడం వంటి లక్షణాలు పక్షవాతానికి సంకేతాలు కావచ్చు. కొన్నిసార్లు ఈ లక్షణాలు కొన్ని నిమిషాల్లోనే తగ్గిపోతాయి. అయినప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి భవిష్యత్తులో స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని సూచించే ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్ (టీఐఏ) లక్షణాలు కూడా కావచ్చని వైద్యులు హెచ్చరించారు.
లక్షణాలు తగ్గుతాయని వేచి చూడొద్దు
కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ క్లినికల్ డైరెక్టర్, న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎస్.కె. జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘పక్షవాతం వచ్చినప్పుడు చాలామంది కుటుంబ సభ్యులు లక్షణాలు వాటంతట అవే తగ్గిపోతాయని భావించి ఆసుపత్రికి తీసుకురావడంలో ఆలస్యం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల చికిత్సకు కీలకమైన సమయం వృథా అవుతోంది. ముఖం వాలిపోవడం, చేయి బలహీనపడటం, మాట పడిపోవడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే అత్యవసర వైద్యసాయం తీసుకోవాలి. తొలి గంట అత్యంత కీలకమైనప్పటికీ ప్రతి నిమిషం విలువైనదే. ఎంత త్వరగా ఆసుపత్రికి చేరుకుంటే అంత త్వరగా పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది’’ అని వివరించారు.
యువతలోనూ పక్షవాతం ముప్పు
అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ఊబకాయం, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, కొన్ని గుండె సంబంధిత సమస్యలు పక్షవాతం ముప్పును పెంచుతాయని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఎలాంటి లక్షణాలు లేకుండానే పెరిగే అవకాశం ఉండటంతో క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని సూచించారు.
బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌కు చెందిన క్లినికల్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ అకాడమిక్స్, మరియు సీనియర్ కన్సల్టెంట్ – న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రొఫెసర్ ఉమేష్ టి మరింత వివరిస్తూ.. ‘‘పక్షవాతం వృద్ధులకు మాత్రమే వస్తుందనుకోవడం పొరపాటు. యువతలోనూ అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, ధూమపానం వంటి కారణాలతో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యంగా ఉన్నామనే భావనతో చాలామంది రక్తపోటును పట్టించుకోవడం లేదు. మరికొందరు బీపీ అదుపులోకి రాగానే మందులు మానేస్తున్నారు. ఇది ప్రమాదకరం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచనల మేరకు మందులు వాడటం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా పక్షవాతం ముప్పును తగ్గించుకోవచ్చు’’ అని తెలిపారు.
చికిత్స తర్వాత కోలుకోవడమూ ముఖ్యమే
పక్షవాతం వచ్చినప్పుడు మెదడులో రక్తనాళం మూసుకుపోయిందా, చిట్లిపోయిందా అనేది గుర్తించడం అత్యవసరం. ఇందుకోసం బ్రెయిన్ స్కాన్, నిపుణుల వైద్య పరీక్షలు అవసరమవుతాయి. స్ట్రోక్ తీవ్రతను బట్టి అత్యవసర చికిత్సతో పాటు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమవుతాయని వైద్యులు వివరించారు.
పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే అత్యవసర వైద్యసాయం పొందాలని, లక్షణాలు ప్రారంభమైన సమయాన్ని గుర్తుంచుకోవాలని కేర్ హాస్పిటల్స్ వైద్యులు సూచించారు. లక్షణాలు తగ్గిపోయినా నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు. సకాలంలో చికిత్స పొందడం ద్వారా పక్షవాతం కారణంగా సంభవించే మరణాలు, దీర్ఘకాలిక వైకల్యాల ముప్పును తగ్గించవచ్చని తెలిపారు.
