హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఘర్షణలు మానవాళికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, ప్రపంచ శాంతి స్థాపనకు ప్రతి దేశం కృషి చేయాలని మోర్డ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, మిషన్ మోడీ జాతీయ కార్యదర్శి డాక్టర్ అండెకార్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
తెలంగాణ సారస్వత పరిషత్, హైదరాబాద్లో మోర్డ్ ఆర్గనైజేషన్, గ్లోబల్ సేవా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ శాంతి దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్–పాలస్తీనా ఘర్షణల వల్ల అమాయక ప్రజలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క దేశంలో యుద్ధం జరుగుతుంటే మనకేమిటని నిర్లక్ష్యం చేయకూడదని, ప్రపంచ దేశాలు శాంతి స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ఎన్జీవోలకు ప్రపంచ శాంతి పురస్కారాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్, జర్మన్ టెన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మీర్ జ్వాద్ జర్ ఖాన్, వంశీ టీవీ వంశీ కృష్ణ, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్తేఖార్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
యుద్ధాలు ఆగి ప్రపంచంలో శాంతి నెలకొన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని వక్తలు ఆకాంక్షించారు.
