ఘనంగా శ్రీ వేంకటేశ్వర శశికళ నికేతన్ 11వ వార్షికోత్సవ వేడుకలు
108 మంది నృత్య కళాకారిణులతో 108 కరణాల ప్రదర్శన.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అరుదైన గుర్తింపు
హైదరాబాద్: అమెరికాలో మెకానికల్ ఇంజినీర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర శశికళ నికేతన్ వ్యవస్థాపకురాలు, సంచాలకురాలు డాక్టర్ వి. హేమ వనసర్ల. విదేశంలో నివసిస్తున్నప్పటికీ మాతృభూమి కళలపై ఉన్న మక్కువతో చిన్నారులకు భారతీయ శాస్త్రీయ నృత్యకళల్లో శిక్షణ అందిస్తూ భావితరాల కళాకారులను తీర్చిదిద్దుతున్నారు.
తన వృత్తిపరమైన బాధ్యతలతో పాటు కళాసేవకు సమయం కేటాయిస్తూ ఆన్లైన్, ప్రత్యక్ష పద్ధతుల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని చింతల్, భారత్ నగర్ ప్రాంతాల్లో రెండు శాఖల ద్వారా నృత్య తరగతులు నిర్వహిస్తున్నారు. హేమ వనసర్ల మార్గదర్శకత్వంలో అక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. నృత్యాన్ని నేర్పడమే కాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడంపై ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యం కలిగిన ఆమెకు కళలు, నటన, రచన, సామాజిక సేవ, క్రీడలు వంటి విభిన్న రంగాల్లోనూ అనుభవం ఉంది. విదేశంలో ఉద్యోగం చేస్తూనే స్వదేశంలోని చిన్నారులకు కళా శిక్షణ అందిస్తూ, గురువులకు మార్గనిర్దేశం చేస్తూ సంస్థను ముందుకు నడిపించడం ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది.
ఈ నేపథ్యంలో శ్రీ వేంకటేశ్వర శశికళ నికేతన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ వార్షికోత్సవ వేడుకలు నవంబర్ 16న భారత్ నగర్‌లోని హరిహర క్షేత్ర దేవస్థానంలో ఘనంగా జరిగాయి. కార్తీక మాస నృత్య నీరాజనం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 108 మంది నృత్య కళాకారిణులు 108 కరణాలతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. సమన్వయంతో సాగిన ఈ ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు పొందింది.
పర్యావరణ ద్రోణాచార్య జాతీయ పురస్కార గ్రహీత, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రత్యేక జ్యూరీ సభ్యులు డాక్టర్ టి.వి. అశోక్ కుమార్ సైతం పాల్గొని విద్యార్థులకు గుర్తింపు పత్రాలను అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న నృత్య కళాకారిణులందరికీ మెడల్స్, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు.
ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, ‘మనసంతా నువ్వే’ చిత్ర దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. హేమ వనసర్ల చేస్తున్న కళాసేవను, విద్యార్థుల నృత్య ప్రదర్శనలను ప్రస్తావిస్తూ ఆమె కృషిని అభినందించారు.
హాస్యబ్రహ్మ, హాస్యవదన సామ్రాట్, కళారత్న టి. శంకరనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని అమెరికాలో ఉంటూనే భారతీయ కళల కోసం హేమ వనసర్ల చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఆన్లైన్, ప్రత్యక్ష శిక్షణ ద్వారా చిన్నారులకు నృత్యాన్ని నేర్పిస్తూ వారిని కళాకారులుగా తీర్చిదిద్దుతున్న విధానం అభినందనీయమని పేర్కొన్నారు.
సాంచలనా స్కూల్ ఆఫ్ డాన్స్ వ్యవస్థాపకురాలు, సంచాలకురాలు విశిష్ట అతిథి శ్రీమతి పద్మ కళ్యాణ్ వజ్జ కార్యక్రమంలో పాల్గొని హేమ వనసర్ల అంకితభావం, విద్యార్థుల సాధన, నృత్య ప్రదర్శనల గురించి మాట్లాడారు. కార్యక్రమం మొత్తం విద్యార్థుల ప్రదర్శనలను వీక్షిస్తూ వారి ప్రతిభను అభినందించారు.
ఈ వేడుకలను కె. రమ్య నాయుడు పర్యవేక్షించడంతో పాటు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అతిథుల పరిచయం, కార్యక్రమాల నిర్వహణ, నృత్య ప్రదర్శనల సమన్వయాన్ని చక్కగా నిర్వహించి వేడుకలను ఆద్యంతం ఆకట్టుకునేలా ముందుకు నడిపించారు.
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు నాగిరెడ్డి గారితో పాటు పలువురు కాలనీ పెద్దలు డాక్టర్ హేమ వనసర్లను అభినందించి చిన్నారులను ఆశీర్వదించారు.
కళలకు ప్రోత్సాహం, గురువులకు గౌరవం, విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు కల్పించడమే లక్ష్యంగా శ్రీ వేంకటేశ్వర శశికళ నికేతన్ తన సాంస్కృతిక ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. 108 మంది కళాకారిణులతో నిర్వహించిన 108 కరణాల ప్రదర్శన ఈ వార్షికోత్సవానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.
కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, గురువులు, కళాకారిణులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కాలనీ పెద్దలు, సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ కార్యక్రమం ఆధ్యాంతం విజయవంతం కావడానికి సహకరించిన శ్రీ వేంకటేశ్వర శశికళ నికేతన్ సిబ్బంది దీపా జె, రేవతి వి. అనూష వై. సాయి తన్మయి, శ్రుతి బి,నివేదిత, భవాని పి. టిట్లీ రాయ్, ఉమా మహేశ్వరి యు. లక్ష్మి సాయి, డాక్టర్ వి. హేమ వనసర్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
