హైదరాబాద్, నవంబర్ 17, 2026: నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ యువ’ పేరిట మాదకద్రవ్యాల వినియోగ నివారణపై ఒకరోజు రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలోని గోదావరి హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సీఎంఓలు, డీఎస్ఓలు, రిసోర్స్ పర్సన్లు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా నోడల్ అధికారులు, రిసోర్స్ పర్సన్ల సామర్థ్యాలను పెంపొందించి, పాఠశాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలను విస్తరించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం.
ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు డా. ఇ. నవీన్ నికోలస్, ఐఏఎస్, మాదకద్రవ్యాల నివారణకు సంబంధించిన వార్షిక కార్యాచరణ క్యాలెండర్ను ఆవిష్కరించారు. పాఠశాలల్లో ఏడాది పొడవునా అవగాహన, నివారణ కార్యక్రమాలను క్రమబద్ధంగా నిర్వహించేందుకు ఈ క్యాలెండర్ దిశానిర్దేశం చేస్తుంది. ప్రారంభ సమావేశంలో సమగ్ర శిక్ష సంయుక్త సంచాలకులు శ్రీ పి. మదన్ మోహన్ మాట్లాడుతూ, విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను నిశితంగా గమనిస్తూ, పాఠశాల స్థాయిలో సూక్ష్మ పరిశీలన, పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు. సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, విద్యార్థులకు సకాలంలో మార్గదర్శనం, తగిన సహకారం అందించాలని సూచించారు.
రాష్ట్రస్థాయి శిక్షణలో పాల్గొన్న అధికారులు, రిసోర్స్ పర్సన్లు తమ జిల్లాల్లో తదుపరి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన కోరారు. ప్రతి పాఠశాలను మాదకద్రవ్య రహిత విద్యా ప్రాంగణంగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
శిక్షణలో భాగంగా ఈగల్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ పి. శ్రీనివాసరావు, టెలీ-మానస్ సైకాలజిస్టు, కౌన్సెలర్ శ్రీ జవహర్లాల్ నెహ్రూ, సమగ్ర శిక్ష ప్రతినిధులు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగ నివారణ, కౌమారదశలో ఎదురయ్యే ఒత్తిళ్లు, మానసిక ఆరోగ్యం, కౌన్సెలింగ్ ప్రాధాన్యం, విద్యార్థులకు సకాలంలో సహాయం అందించడంలో పాఠశాలల పాత్రపై శిక్షణా తరగతులు నిర్వహించారు.
