Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

“ఒక్క సమాధానం కోసం సింగరేణి అధికారుల ఆవేదన”

మా పోరాటం ఎందుకు?

ప్రకటన న్యూస్, కొత్తగూడెం, 29 జూలై, 2026: మేము సింగరేణి అధికారులను అడుగుతున్నది ప్రత్యేక హక్కులు కాదు. అన్యాయమైన డిమాండ్లు కాదు.
చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, నిబంధనల ప్రకారం మాకు రావాల్సిన హక్కులను మాత్రమే కోరుతున్నాం.

*మా ప్రధాన డిమాండ్లు*

✅ పే అప్‌గ్రేడేషన్ (PAY UPGRADATION) తక్షణ అమలు

✅ 2022- 2023, 2023-2024 సంవత్సరాలకు సంబంధించిన పీఆర్‌పీ (PERFORMANCE RELATED PAY) చెల్లింపు

✅ సింగరేణికి రావాల్సిన భారీ బకాయిల వసూలు

✅ కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు మరియు కొత్త గనుల అభివృద్ధి

✅ సింగరేణి అభివృద్ధికి ఆటంకంగా ఉన్న రాజకీయ, అనవసర జోక్యాలు, ఒత్తిడులకు ముగింపు

పే అప్‌గ్రేడేషన్ – తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతున్న అన్యాయం

సింగరేణి అధికారులకు పదేళ్లకు ఒకసారి పే రివిజన్, పే అప్‌గ్రేడేషన్ అమలు చేయడం ఆనవాయితీ. ఇది ఎలాంటి ప్రత్యేక సౌకర్యం కాదు. అధికారుల సేవలను, బాధ్యతలను, పెరుగుతున్న జీవన వ్యయాలను పరిగణనలోకి తీసుకొని అమలు చేసే వేతన విధానం.

2017లో అమలైన పే రివిజన్‌లో ఏర్పడిన అసమానతలు, అసమతుల్యతలు దేశవ్యాప్తంగా అధికారుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ కోల్ ఇండియా మరియు దాని అనుబంధ సంస్థల అధికారులు ఎన్నో సంవత్సరాలు పోరాటం చేశారు.

ర్యాలీలు నిర్వహించారు. ప్రతినిధి బృందాలు పంపారు. కోల్ మినిస్ట్రీని కలిశారు. ప్రజాప్రతినిధులను కలిశారు. వందలాది రిప్రజెంటేషన్లు సమర్పించారు. చివరకు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత కోర్టు ఉత్తర్వుల మేరకు 2026 జనవరి నుండి కోల్ ఇండియా మరియు దాని అనుబంధ సంస్థల అధికారులకు పే అప్‌గ్రేడేషన్ అమలు చేయబడింది.

*మరి మా ప్రశ్న ఏమిటంటే*

అదే బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న సింగరేణి అధికారులకు ఆ న్యాయం ఎందుకు వర్తించడం లేదు?
కోర్టు చెప్పిన తర్వాత కూడా ఎందుకు అమలు కావడం లేదు? దేశవ్యాప్తంగా అమలవుతున్న విధానం సింగరేణిలో మాత్రమే ఎందుకు నిలిచిపోయింది?
మేము తక్కువ పని చేస్తున్నామా? మా బాధ్యతలు తక్కువవా? మా సేవలకు విలువ లేదా?

ఒకే రంగంలో పనిచేస్తూ, ఒకే విధమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఒకే న్యాయ సూత్రాలకు లోబడి ఉండగా, సింగరేణి అధికారులపై మాత్రమే ఈ వివక్ష ఎందుకు?

ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో వేలాది మంది అధికారులు లక్షల రూపాయల ఆర్థిక నష్టాన్ని చవిచూశారు. వారి కుటుంబాల భవిష్యత్తు ప్రణాళికలు దెబ్బతిన్నాయి. పిల్లల చదువులు, గృహ రుణాలు, కుటుంబ అవసరాలపై ప్రభావం పడింది.

అందుకే మేము మరోసారి స్పష్టంగా చెబుతున్నాం—
పే అప్‌గ్రేడేషన్ మా హక్కు.  దానిని ఆలస్యం చేయడం అన్యాయం. దానిని అమలు చేయకపోవడం వివక్ష.

*పీఆర్‌పీ (PERFORMANCE RELATED PAY) – మా జీతంలో భాగం*

పీఆర్‌పీ గురించి బయట ప్రజలకు, ప్రజాప్రతినిధులకు పూర్తి అవగాహన లేదు.

 

చాలామంది దానిని బోనస్‌గా భావిస్తారు. అది పూర్తిగా తప్పు. పీఆర్‌పీ అనేది మా జీతంలో అంతర్భాగం.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (DPE) మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల అధికారులకు పనితీరు ఆధారంగా చెల్లించే వేతన భాగమే పీఆర్‌పీ.

ప్రతి నెల మేము పూర్తి జీతం(100%) తీసుకోవడం లేదు.మా వేతనంలో భాగాన్ని (15% APROX) పనితీరు ఆధారంగా నిలిపి ఉంచుతారు.
సంస్థ వార్షిక లక్ష్యాలు సాధించిన తర్వాత, మాకు రావాల్సిన ఆ మొత్తాన్ని పీఆర్‌పీ రూపంలో చెల్లించాలి.
అంటే ఇది బహుమతి కాదు.ఇది యాజమాన్యం ఇష్టానుసారం ఇచ్చే ప్రోత్సాహకం కాదు.

ఇది మా కష్టానికి సంబంధించిన మా సంపాదన.మా జీతంలో భాగం.

దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ విధానం క్రమం తప్పకుండా అమలవుతోంది.

కోల్ ఇండియా మరియు దాని అనుబంధ సంస్థలలో కూడా పీఆర్‌పీ చెల్లింపులు జరుగుతున్నాయి.

కానీ సింగరేణిలో మాత్రం 2022- 2023,2023-2024 సంవత్సరాలకు సంబంధించిన పీఆర్‌పీ ఇప్పటికీ చెల్లించలేదు.

2 సంవత్సరాలుగా అధికారుల వేతనంలో భాగమైన డబ్బు నిలిచిపోయింది.

మరి మా ప్రశ్న— మేము పని చేయలేదా* ? మేము సంస్థ లక్ష్యాల సాధనలో భాగస్వామ్యం కాలేదా?మేము కంపెనీకి నష్టం చేశామా?మా జీతంలో భాగమైన డబ్బు 2 సంవత్సరాలుగా ఎందుకు నిలిపివేశారు?

దేశంలో ఏ ఉద్యోగి అయినా తన కష్టానికి తగిన వేతనం సమయానికి పొందాలి.అది ప్రాథమిక హక్కు. మరి మా విషయంలో మాత్రమే ఈ జాప్యం ఎందుకు?

ఆలస్యమైన చెల్లింపు కూడా నష్టమే. పీఆర్‌పీ మరియు పే అప్‌గ్రేడేషన్ బకాయిలు సంవత్సరాల క్రితమే చెల్లించాల్సినవి.

ఉదాహరణకు 2022లో రావాల్సిన డబ్బు 2022లోనే ఇచ్చి ఉంటే—మా పిల్లల విద్య కోసం వినియోగించుకునేవాళ్లం. గృహ రుణాలు తీర్చుకునేవాళ్లం. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టుకునేవాళ్లం.ఆ సమయంలో బంగారం ధర ₹55,000 నుండి ₹60,000 మధ్య ఉండేది. ఈరోజు అదే ధర లక్ష రూపాయలకు పైగా చేరుకుంది.అంటే మాకు రావాల్సిన డబ్బు మాత్రమే కాదు, ఆ డబ్బు కొనుగోలు శక్తి కూడా కోల్పోయాము.

ఇది కేవలం జీతం ఆలస్యం కాదు. ఇది వేలాది కుటుంబాల ఆర్థిక నష్టం. ఇది అధికారుల భవిష్యత్తుపై ప్రభావం.ఇది కుటుంబాల ఆశలపై దెబ్బ.

అందుకే మేము అడుగుతున్నాం— ఇంకా ఎంతకాలం వేచి చూడాలి?ఇంకా ఎన్ని రిప్రజెంటేషన్లు ఇవ్వాలి?ఇంకా ఎన్ని సార్లు తలుపులు తట్టాలి? ఇంకా ఎన్ని సార్లు కోర్టుల చుట్టూ తిరగాలి?మాకు రావాల్సిన హక్కులను అమలు చేయండి.
మా జీతంలో భాగమైన పీఆర్‌పీ చెల్లించండి. పే అప్‌గ్రేడేషన్‌ను వెంటనే అమలు చేయండి.

ఒక్క జవాబు ఇవ్వండి…/
ఒక్క సమాధానం చెప్పండి…

ఎందుకు రోడ్లపైకి వచ్చాం?  సింగరేణి చరిత్రలో అరుదుగా జరిగే విషయం జరిగింది.  సుమారు 2,000 నుండి 2,500 మంది అధికారులు రామగుండం, శ్రీరాంపూర్, కొత్తగూడెం తదితర ప్రాంతాలలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. మేనేజ్‌మెంట్‌కు సహాయకులుగా ఉండే అధికారులు రోడ్లపైకి రావడం మాకు గర్వకారణం కాదు.

ఇది పరిస్థితుల తీవ్రతకు నిదర్శనం. సింగరేణి భవిష్యత్తు కూడా మా ఆందోళనే. మేము కేవలం మా హక్కుల కోసమే కాదు, సంస్థ భవిష్యత్తు కోసం కూడా పోరాడుతున్నాం.  సింగరేణికి కొత్త బ్లాకులు రావాలి.కొత్త గనులు ప్రారంభం కావాలి. సంస్థకు రావాల్సిన భారీ బకాయిలు వెంటనే చెల్లించాలి.  ఉద్యోగ భద్రత బలోపేతం కావాలి. భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు పెరగాలి.

రాజకీయ జోక్యాలపై మా ఆందోళన

సంస్థ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలలో టాప్ మేనేజ్మెంట్ సరైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వాటి అమలులో వివిధ స్థాయిలలో ఏర్పడుతున్న రాజకీయ ఒత్తిడులు, రాజకీయ ప్రమేయాలు ఆటంకాలుగా మారుతున్నాయనే భావన ఉద్యోగుల్లో ఉంది.సంస్థ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు త్వరగా అమలయ్యే వాతావరణం కల్పించాలి.సింగరేణి అభివృద్ధి రాజకీయాలకు అతీతంగా ఉండాలి.

కార్మిక అన్నదమ్ములకు మా పిలుపు. సింగరేణి కుటుంబంలో భాగమైన కార్మిక అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, ఉద్యోగ సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు అందరూ మా పోరాటానికి సంఘీభావం తెలపాలి. ఈ పోరాటం అధికారులది మాత్రమే కాదు.సింగరేణి భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం.
మన ఇంటి సమస్యను మనమంతా కలిసి పరిష్కరించుకుందాం.

గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి

గౌరవ ముఖ్యమంత్రి గారూ.. మీరు కూడా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చారు. పోరాటం విలువ మీకు తెలుసు.న్యాయం కోసం ఎదురు చూడడం అంటే ఏమిటో మీకు తెలుసు.
మా ఆవేదనను అర్థం చేసుకొని—పే అప్‌గ్రేడేషన్ అమలు చేయండి. పీఆర్‌పీ చెల్లించండి.
సింగరేణి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోండి. మా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపించండి.

గౌరవ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారూ.. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో సింగరేణి వంటి ప్రజారంగ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సింగరేణి సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేక దృష్టితో పరిశీలించండి. పే అప్‌గ్రేడేషన్ సమస్య పరిష్కరించండి. పీఆర్‌పీ చెల్లింపుల విషయంలో చర్యలు తీసుకోండి. సింగరేణికి రావాల్సిన బకాయిల చెల్లింపుకు సహకరించండి. కొత్త బొగ్గు బ్లాకులు, కొత్త గనుల అభివృద్ధికి మద్దతు ఇవ్వండి.

చివరిగా… మేము ఘర్షణ కోరడం లేదు. మేము ప్రత్యేక హక్కులు కోరడం లేదు. మేము న్యాయం కోరుతున్నాం. మా హక్కులు కోరుతున్నాం. సింగరేణి అభివృద్ధి కోరుతున్నాం. సింగరేణి బలంగా ఉంటేనే మనందరి భవిష్యత్తు బలంగా ఉంటుంది.

ఐక్యతే మన బలం…న్యాయమే మన లక్ష్యం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *