రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ వంటి పండుగల సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక దుస్తులను పంపిణీ చేస్తున్నట్లుగానే, గిరిజన లంబాడీల అత్యంత పవిత్రమైన హర్యాలీ తీజ్ మహోత్సవం సందర్భంగా లంబాడీ ఆడపిల్లలకు సంప్రదాయ అద్దాల (మిర్రర్ వర్క్) లంబాడీ డ్రెస్‌లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని లంబాడీల ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ & కాలేజ్ కన్వీనర్ రాహుల్ నాయక్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాటలాడుతూ హర్యాలీ తీజ్ పండుగ శ్రావణ మాస శుక్ల పక్షంలో (చాందిని రాత్) ప్రారంభమవుతుంది. మొదటి శుక్రవారం గోధుమలను నానబెట్టి, శనివారం బుట్టల్లో గోధుమలను ఉంచి డాక్లోపై ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని “తీజ్ బోయేరో” గా నిర్వహిస్తారు.
తదుపరి ఆదివారం కడావ్ తీజ్ నిర్వహించి, ఆ రోజు మ్యారామ భవానీ మరియు సద్గురువు సేవాలాల్ మహారాజ్ వారికి నైవేద్యం సమర్పించి, తండా పెద్దల ఆధ్వర్యంలో భోగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నుంచి తొమ్మిది రోజుల తీజ్ మహోత్సవం ప్రారంభమై, చివరి రోజు తీజ్ నిమజ్జన కార్యక్రమంతో ముగుస్తుంది. నిమజ్జనం రోజున అడపడుచులలో సాక్షాత్తూ మ్యారామ భవానీని దర్శించినట్లుగా భావించి, అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్ల కాళ్లు కడిగి వారి ఆశీర్వాదాలను తీసుకోవడం ఈ పండుగలోని విశిష్టమైన సంప్రదాయం. ఈ తొమ్మిది రోజుల మహోత్సవం గోర్ బంజారా సమాజానికి చెందిన వివాహం కాని అమ్మాయిలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే పవిత్రమైన పండుగ. తెలంగాణలో గిరిజన లంబాడీల జనాభా అధికంగా ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం హర్యాలీ తీజ్ మహోత్సవానికి అధికారిక గుర్తింపు కల్పించి, ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించడంతో పాటు ఆగస్టు 24 తేదీన ప్రభుత్వ సెలవు ప్రకటించాలని, అలాగే 2027 రాష్ట్ర ప్రభుత్వ సెలవుల క్యాలెండర్లో హర్యాలీ తీజ్‌ను అధికారిక సెలవుగా చేర్చాలని రాహుల్ నాయక్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ సంవత్సరం ఆగస్టు 12న అమావాస్య ఉన్న నేపథ్యంలో, దాని తరువాత వచ్చే. శనివారం (ఆగస్టు 15) న తీజ్ బోయేరో కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో చుటో కడావ్ సంప్రదాయం ఉన్నందున, వారు ఆగస్టు 23, ఆదివారం రోజున ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలకు ప్రభుత్వం సమాన గౌరవం కల్పించి, హర్యాలీ తీజ్ మహోత్సవానికి అధికారిక గుర్తింపు ఇవ్వాలి అని రాహుల్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.
