- ప్రజా ప్రభుత్వంలో చేనేతకు మరింత గౌరవం.. నేతన్నలకు మరింత భరోసా
- చేనేతను ఆదరిస్తే నేతన్న కుటుంబాలకు అండగా నిలిచినట్లే
- వారం లో కనీసం రెండు రోజులైనా చేనేత వస్త్రాలు ధరించాలి
- జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆగస్టు 7: చేనేత రంగానికి మరింత గౌరవం, నేతన్నలకు నిరంతర ఉపాధి, చేనేత ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క అన్నారు. వ్యవసాయం, చేనేత రంగాలు తమ ప్రభుత్వానికి రెండు కళ్ల వంటివని ఆమె పేర్కొన్నారు. చేనేత కార్మికుల కష్టానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న చేనేత వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణ, మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, చేనేత కళాకారులు పాల్గొన్నారు.
పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన నేతన్నలు తయారు చేసిన చేనేత చీరలు, వస్త్రాలను ఆమె పరిశీలించారు. స్వయంగా మగ్గం నేసి నేతన్నల నైపుణ్యాన్ని తెలుసుకున్నారు. చేనేత చీరలను కొనుగోలు చేసి, ప్రజలు కూడా చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. చేనేత కళాకారులు, ప్రముఖులను శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు, ముఖ్యంగా తెలంగాణ నేతన్నలు, నేతమ్మలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయం తర్వాత అధికంగా కష్టపడేది నేతన్నలేనని అన్నారు. ఒక చీర వెనుక కేవలం నూలుపోగులు మాత్రమే ఉండవని, ఒక కుటుంబం ఆశ, నేతన్న నైపుణ్యం, తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ఉంటుందని చెప్పారు.
నరుడికి నాగరికత నేర్పింది నేతన్నలేనని మంత్రి సీతక్క అన్నారు. మనిషి వస్త్రాన్ని నేయడం, ధరించడం ప్రారంభించినప్పుడే నాగరిక సమాజానికి నాంది పడిందని తెలిపారు. నేతన్న నూలుపోగు మన నాగరికతకు చిహ్నమని, చేనేత కేవలం ఒక వృత్తి కాదని, అది మన సంస్కృతికి ప్రతీక, సంప్రదాయానికి చిరునామా అని పేర్కొన్నారు.
చేనేత రంగాన్ని కేవలం సంక్షేమ కోణంలో కాకుండా ఉపాధి, ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ కోణంలో ప్రభుత్వం చూస్తోందన్నారు. నేతన్నల కష్టం వృథా కాకుండా నిరంతర ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల విలువైన ఇందిరమ్మ చీరల ఆర్డర్లను చేనేత కార్మికులకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. దీంతో వేలాది నేత కుటుంబాలకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌లకు అవసరమైన వస్త్రాన్ని కూడా చేనేత కార్మికుల నుంచే కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఏడాది కోట్ల మీటర్ల వస్త్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా చేనేత రంగానికి బలమైన మార్కెట్ కల్పిస్తున్నామని తెలిపారు.
గతంలో పేరుకుపోయిన నేతన్నల బకాయిలను కూడా తమ ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తోందని సీతక్క చెప్పారు. చేనేత రంగం అభివృద్ధి, సంక్షేమం కోసం ఇప్పటికే సుమారు రూ.1,300 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేనేతకు మరింత గౌరవం, మార్కెట్, భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
నేతన్నల చేతుల్లో నూలు చక్రం నిరంతరం తిరిగితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని మంత్రి అన్నారు. చేనేత బతికితే వేలాది కుటుంబాలు బతుకుతాయని పేర్కొన్నారు. ప్రజలంతా చేనేతకు తమ వంతు మద్దతు ఇవ్వాలని కోరారు.
వారం లో కనీసం రెండు రోజులైనా చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సీతక్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను కూడా చేనేత దుస్తులు ధరించడానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. పండుగలు, శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో కనీసం ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేయడం అంటే ఒక నేత కుటుంబానికి అండగా నిలవడమేనని అన్నారు.
చేనేతను ఆదరించడం అంటే మన సంస్కృతిని గౌరవించడమేనని, నేతన్నలను ప్రోత్సహించడం అంటే గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయడమేనని మంత్రి సీతక్క అన్నారు. అందరం చేనేతను ఆదరించి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు.
