కాకినాడ, ఆగస్టు 29:
అడికవి నన్నయ యూనివర్సిటీ ఎం.ఎస్.ఎన్. క్యాంపస్, కాకినాడలో హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం, అలాగే తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రశాంతి శ్రీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో విద్యతో పాటు క్రీడలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ధ్యాన్ చంద్ దేశానికి అందించిన క్రీడా సేవలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.
ప్రత్యేక అతిదిగా పాల్గొన్న డా. మాణికిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ చైర్మన్ డా. మాణికిరెడ్డి సత్యనారాయణ, మాట్లాడుతూ, తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు సాహిత్యం మరియు సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాతృభాష పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవడంతో పాటు, ఆధునిక విద్యా, సాంకేతిక రంగాల్లోనూ తెలుగు భాష వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా ప్రతిభ, దేశానికి ఆయన చేసిన సేవలు, క్రీడా స్ఫూర్తి గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే వక్తలు
డా. హరినాథ్ రాజా, డా. నమశివాయ గరికపాటి
తెలుగు భాషా దినోత్సవం ప్రాముఖ్యతను తెలియజేస్తూ, తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధి, వ్యాప్తికి యువత మరింత చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వివిధ క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. క్రీడా స్ఫూర్తి, మాతృభాషాభిమానం రెండింటినీ విద్యార్థుల్లో పెంపొందించేలా ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషంగా నిలిచింది.
