Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

33 జిల్లాల కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లోని ప్రముఖ క్రీడా ప్రాంగణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

హైదరాబాద్, ఆగస్టు 29:
మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం, ఎల్‌బీ స్టేడియం, కేవీబీ ఇండోర్ స్టేడియం, సరోూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, సైక్లింగ్ వెలోడ్రోమ్, జింఖానా గ్రౌండ్స్ తదితర ప్రముఖ క్రీడా ప్రాంగణాల్లో వివిధ క్రీడా, శారీరక దారుఢ్య కార్యక్రమాలు నిర్వహించారు.

గచ్చిబౌలి హాకీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీ వకాటి శ్రీహరి మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) చైర్మన్ శ్రీ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సోనిబాలాదేవి, అర్జున అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గాయత్రి గోపీచంద్, బ్యాడ్మింటన్ ఛాంపియన్ ట్రీసా జాలీ, ఆసియా క్రీడాకారిణి నందిని అగసరా, క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు, క్రీడాకారులు, కోచ్‌లు కార్యక్రమంలో పాల్గొని మేజర్ ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ వకాటి శ్రీహరి మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం క్రీడా బడ్జెట్‌ను గణనీయంగా పెంచిందన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.325 కోట్లు, 2025–26లో రూ.414 కోట్లు, 2026–27లో రూ.606 కోట్లను క్రీడలకు కేటాయించినట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

దేశంలోనే అత్యంత విస్తృతమైన గ్రామీణ స్థాయి క్రీడా కార్యక్రమాల్లో ఒకటిగా సీఎం కప్‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీ, మండల స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 5.41 లక్షల మంది యువ క్రీడాకారుల వివరాలను గుర్తించి నమోదు చేశామని, తద్వారా క్షేత్రస్థాయిలోని క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వానికి వీలు కలుగుతోందన్నారు.

గతంలో రాష్ట్రంలో కేవలం ఆరు క్రీడా అకాడమీలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్యను 20కి పెంచినట్లు మంత్రి వెల్లడించారు. వీటిలో రెండు అకాడమీలు ఫిఫా టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్లు, నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తింపు పొందాయని తెలిపారు. మహిళల ఫుట్‌బాల్ కోసం ఏర్పాటు చేసిన ఫిఫా టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్ దేశంలోనే ఈ తరహాలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి మహిళా ఫుట్‌బాల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా నిలిచిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 నిర్వహణకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీహరి, ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా ఈవెంట్‌ను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భారీ నిధులను కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

క్రీడాకారులు, కోచ్‌ల సంక్షేమంతో పాటు రాష్ట్రంలో క్రీడల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేసి, రూపాంతరం తీసుకురావడానికి అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారిణులు నందిని అగసరా, గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను వారి క్రీడా విజయాలు, క్రీడారంగానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఘనంగా సత్కరించింది.

అనంతరం మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, SATG చైర్మన్ శ్రీ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సోనిబాలాదేవితో కలిసి మేజర్ ధ్యాన్‌చంద్ మెమోరియల్ ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్’ ఫైనల్ మ్యాచ్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ రవితేజ, రవీందర్, శ్రీనివాస్, అశోక్ కుమార్, ఇంజనీర్ శ్రీనివాస్ పి ఆర్ ఓ కాలేరు సురేష్ , గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కె. మధు, హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్, కార్యదర్శి భీమ్ సింగ్‌తో పాటు క్రీడాకారులు, క్రీడా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

రేపు ‘సండేస్ ఆన్ సైకిల్ – స్పెషల్ ఎడిషన్

జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో భాగంగా ‘సండేస్ ఆన్ సైకిల్ – స్పెషల్ ఎడిషన్’ కార్యక్రమాన్ని రేపు (ఆదివారం) రాష్ట్రంలోని 33 జిల్లాల కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని వివిధ స్టేడియాల్లో నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, యువత, ప్రజలు పాల్గొనేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజల్లో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, శారీరక దారుఢ్యంపై అవగాహన కల్పించడం, నిత్య శారీరక వ్యాయామం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *