ప్రకటన న్యూస్ ప్రతినిధి బి. అనిత
హైదరాబాద్, జూలై 06, 2026: విద్యార్థుల్లో నిక్షిప్తమై ఉన్న శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, పరిశోధనా సామర్థ్యాలను వెలికితీసి మెరుగుపరచేందుకు “విద్యార్థి విజ్ఞాన్ మంథన్” దేశంలోనే అత్యుత్తమ వేదికగా నిలుస్తోందని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య పేర్కొన్నారు.

తేదీ:05-06-2026 (ఆదివారం) హైదరాబాద్ -అమీర్ పేట ధరం కరణ్ రోడ్డులోని “సిస్టర్ నివేదిత ఉన్నత పాఠశాలలో” విజ్ఞాన భారతి, విజ్ఞాన తెలంగాణ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన “విద్యార్థి విజ్ఞాన్ మంథన్ – 2026-27” సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్ష కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం మరియు రాష్ట్రంలోని జిల్లా సమన్వయకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి విజ్ఞాన తెలంగాణ అధ్యక్షులు జి. భాను ప్రకాష్ రెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య మాట్లాడుతూ, వేదకాలం నుంచే భారతదేశం ప్రపంచానికి అనేక శాస్త్రీయ ఆవిష్కరణలను అందించిందని, కనాద మహర్షి నుండి భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం వరకు కొనసాగిన భారతీయ విజ్ఞాన పరంపర నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టిన ఈ గొప్ప శాస్త్రీయ వారసత్వాన్ని భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో విజ్ఞాన భారతి నిర్వహిస్తున్న విద్యార్థి విజ్ఞాన్ మంథన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోందని తెలిపారు.
6వ తరగతి నుండి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో భారతీయ విజ్ఞాన సంపదపై అవగాహన పెంపొందించడంతో పాటు, వారిలోని శాస్త్రీయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, జాతీయ భావనలను వెలికితీసి సరైన మార్గదర్శకత్వం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. కేంద్ర విద్యాశాఖ సహకారంతో ఎన్ సి ఇ ఆర్ టి, ఎన్ సి ఎస్ ఎం, ఎస్ సి ఇ ఆర్ టి వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజ్ఞాన భారతి డిజిటల్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించడం విశేషమన్నారు.
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు దేశంలోని ప్రముఖ శాస్త్ర సాంకేతిక సంస్థలను సందర్శించే అవకాశం, ప్రముఖ శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మమేకమై వారి నుంచి మార్గదర్శనం పొందే అరుదైన అవకాశాన్ని విద్యార్థి విజ్ఞాన్ మంథన్ కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు అధిక సంఖ్యలో విద్యార్థులను (డబ్ల్యు డబ్ల్యూ. వివిఎం. ఓ ఆర్ జి) వెబ్సైట్ లో నమోదు చేసి భావి భారత శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే ఈ జాతీయ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాధికారులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న విజ్ఞాన భారతి జాతీయ సంఘటనా కార్యదర్శి *ప్రవీణ్ రాందాస్* మాట్లాడుతూ, భారతీయ వైజ్ఞానిక వారసత్వాన్ని విద్యార్థులకు పరిచయం చేయడమే కాకుండా, పరిశోధనా రంగంలో కెరీర్ నిర్మించేందుకు దిశానిర్దేశం చేసే దేశంలోనే ప్రత్యేకమైన టాలెంట్ సెర్చ్ పరీక్ష విద్యార్థి విజ్ఞాన్ మంథన్ అని అన్నారు. ఇది సాధారణ పోటీ పరీక్ష మాత్రమే కాదని, ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి శాస్త్రవేత్తలు, అధ్యాపకుల ప్రత్యక్ష మార్గదర్శకత్వంలో వారిని భావి పరిశోధకులుగా తీర్చిదిద్దే విశిష్ట కార్యక్రమమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మరింత మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారత భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో విజ్ఞాన భారతి జాతీయ కార్యవర్గ సభ్యులు కొంపెల్లి శాస్త్రి, సి బి ఎస్ ఇ ప్రాంతీయ సమన్వయకులు సునీల్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎన్. రెడ్డి, విజ్ఞాన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ అగర్వాల్, ఆర్థిక కార్యదర్శి వినయ్ బుచ్చి, విద్యా విభాగ్ కార్యదర్శి రామనాథం, విద్యార్థి విజ్ఞాన్ మంథన్ రాష్ట్ర సమన్వయకులు డా. కందాల రామయ్య, పోతరాజు ఆనందం, కందికొండ శ్రీనివాస్, హైదరాబాద్ ప్రాంత సమన్వయకులు ధర్మేందర్, సిస్టర్ నివేదిత ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ లలిత తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన సుమారు 100 మంది జిల్లా సమన్వయకర్తలు, వివిధ పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
