Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

ఆగస్టు 13 – భారత అవయవ దాన దినోత్సవం

13, ఆగస్టు 2026 : హైదరాబాద్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మెదడు మరణానికి గురైన ఓ యువకుడి కుటుంబం, తమ జీవితంలోనే అత్యంత విషాదకరమైన సమయంలో ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. తమ బిడ్డ అవయవాలను దానం చేయడానికి వారు అంగీకరించారు. ఆ ఒక్క నిర్ణయంతో గుండె, కాలేయం, రెండు మూత్రపిండాలు, రెండు కంటి కార్నియాలు తదితర అవయవాలు అవసరమైన రోగులకు చేరి అనేక కుటుంబాల్లో కొత్త ఆశను నింపాయి. ఒక కుటుంబం భరించలేని దుఃఖంలో ఉండగా, మరో ఎన్నో కుటుంబాలు తమ ఆప్తులను తిరిగి పొందిన ఆనందాన్ని అనుభవించాయి. ఇదే అవయవ దానం యొక్క అసలు అర్ధం. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 13న భారత అవయవ దాన దినోత్సవంను నిర్వహిస్తూ, మరణానంతరం కూడా ఒక వ్యక్తి అనేక జీవితాల్లో వెలుగులు నింపగలడనే మానవతా సందేశాన్ని సమాజానికి చేరవేస్తున్నారు. ఆధునిక వైద్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే స్థాయికి చేరుకుంది. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి క్లిష్టమైన అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు నేడు సాధారణ వైద్య సేవల్లో భాగమయ్యాయి.

భారతదేశంలోని అనేక ఆసుపత్రులు ప్రపంచ స్థాయి నైపుణ్యంతో ఈ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ ఒక విరుద్ధమైన వాస్తవం మన ముందుంది. శస్త్రచికిత్సలు చేయగల నైపుణ్యం మనకు ఉన్నా, మార్పిడి చేయడానికి అవసరమైన అవయవాలు మాత్రం తగినంతగా అందుబాటులో లేవు. అందువల్ల వేలాది మంది రోగులు నిరీక్షణ జాబితాల్లో నెలలు, సంవత్సరాలు గడుపుతూ చివరకు అవయవం దొరకక ప్రాణాలు కోల్పోతున్నారు. భారతదేశంలో సమస్య వైద్యుల సామర్థ్యంలో కాదు; సమాజంలో అవయవ దాన సంస్కృతి ఇంకా బలపడకపోవడంలో, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరంలో ఉంది. అవయవ దానం అంటే ఒక వ్యక్తి జీవించి ఉన్న సమయంలో లేదా మెదడు మరణం (Brain Stem Death) అధికారికంగా నిర్ధారణ అయిన తర్వాత తన శరీరంలోని ఉపయోగకరమైన అవయవాలు, కణజాలాలను అవసరమైన రోగులకు స్వచ్ఛందంగా అందించడం. ఒక మరణానంతర దాత ఎనిమిది మంది వరకు ప్రాణాలను రక్షించడమే కాకుండా, కంటి కార్నియాలు, చర్మం, ఎముకలు, గుండె కవాటాలు వంటి కణజాలాల ద్వారా మరెందరికో జీవన నాణ్యతను మెరుగుపరచగలడు. అందుకే అవయవ దానాన్ని “మహాదానం”గా పిలుస్తారు. ఇది కేవలం వైద్య ప్రక్రియ కాదు: మరణానంతరం కూడా మానవత్వాన్ని కొనసాగించే అత్యున్నత సేవ. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది కిడ్నీ, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు వంటి అవయవ వైఫల్యాలతో బాధపడుతున్నారు. వీరిలో అనేక మందికి అవయవ మార్పిడి మాత్రమే శాశ్వత పరిష్కారం. అయినప్పటికీ దాతల కొరత కారణంగా వేలాది మంది నిరీక్షణ జాబితాలోనే జీవితాన్ని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం Transplantation of Human Organs and Tissues Act (THOTA), 1994 ద్వారా అవయవ మార్పిడికి చట్టబద్ద వ్యవస్థను ఏర్పాటు చేసింది. అనంతర సవరణల ద్వారా మెదడు మరణాన్ని చట్టబద్ధ మరణంగా గుర్తించడం, అవయవాల అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం, అనుమతి పొందిన కేంద్రాల్లో మాత్రమే మార్పిడి నిర్వహించడం, పారదర్శక కేటాయింపు విధానాన్ని అమలు చేయడం వంటి కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఇటీవలి కాలంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర నివాస నిబంధన తొలగించడం, వయోపరిమితిని రద్దు చేయడం, నమోదు రుసుములను తొలగించడం వంటి చర్యలతో దేశవ్యాప్తంగా సమాన అవకాశాలను కల్పించే దిశగా ముందడుగు వేసింది. అయితే ప్రపంచ అనుభవం ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. అవయవ దానంలో విజయాన్ని కేవలం చట్టాలు నిర్ణయించవు. చట్టాలతో పాటు సమర్ధవంతమైన ఆసుపత్రి వ్యవస్థ, ప్రజల విశ్వాసం, శిక్షణ పొందిన వైద్య బృందాలు, వేగవంతమైన సమన్వయం, నిరంతర ప్రజా చైతన్యం కూడా అంతే కీలకం. ఈ విషయాన్ని ప్రపంచంలో అత్యుత్తమ అవయవ దాన వ్యవస్థ కలిగిన స్పెయిన్ స్పష్టంగా నిరూపించింది. అక్కడ ప్రతి పెద్ద ఆసుపత్రిలో ప్రత్యేక ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్లు ఉంటారు. ప్రతి ఐసీయూలో మెదడు మరణం సంభవించే అవకాశాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తారు. కుటుంబ సభ్యులతో సానుభూతితో మాట్లాడేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన కౌన్సిలింగ్ బృందాలు ఉంటాయి. జాతీయ స్థాయి సమన్వయ సంస్థ నిరంతరం నాణ్యతా పరిశీలనలు నిర్వహిస్తుంది. అత్యవసర రవాణా వ్యవస్థ అవయవాలను అత్యల్ప సమయంలో అవసరమైన కేంద్రాలకు చేరవేస్తుంది. ఈ సమగ్ర వ్యవస్థ వల్ల స్పెయిన్ ప్రపంచంలోనే అత్యధిక మరణానంతర అవయవ దాన రేటును నమోదు చేస్తోంది. యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి దేశాలు “Presumed Consent” లేదా “Opt-out” విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ అక్కడి విజయానికి అసలు కారణం ప్రజల విశ్వాసం మరియు సమర్ధవంతమైన ఆరోగ్య వ్యవస్థ. అమెరికాలో కూడా నమోదైన అవయవ దాతల సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ, ఆసుపత్రుల మధ్య సమన్వయం, అవయవాల శాస్త్రీయ కేటాయింపు, అత్యవసర రవాణా వ్యవస్థ, ఆధునిక సాంకేతికత కలిసి విజయాన్ని సాధిస్తున్నాయి. అంతర్జాతీయ అనుభవం మనకు ఒక స్పష్టమైన పాఠాన్ని నేర్పుతోంది. అవయవ దానం అనేది చట్టంతో ప్రారంభమయ్యే ఫ్రీక్రియ కావచ్చు; కానీ అది ప్రజల విశ్వాసంతోనే విజయవంతమవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవందానా కార్యక్రమం పారదర్శకత, డిజిటల్ వెయిటింగ్ లిస్టులు, శిక్షణ పొందిన ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్లు, వేగవంతమైన సమన్వయం, గ్రీన్ కారిడార్ వ్యవస్థల ద్వారా జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంది. అధికారిక గణాంకాల ప్రకారం 2025లో జీవందాన్ ద్వారా వందలాది అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా జరిగాయి. కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి వేలాది అవయవాలు, కణజాలాలు సేకరించి అనేక మంది రోగులకు కొత్త జీవితాన్ని అందించారు. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ మరణానంతర అవయవ దాన రేటు గణనీయంగా మెరుగ్గా ఉండటం రాష్ట్ర విజయాన్ని ప్రతిబింబిస్తుంది. అయినప్పటికీ వేలాది మంది రోగులు ఇప్పటికీ మార్పిడి కోసం నిరీక్షిస్తుండటం, రాష్ట్ర జనాభాతో పోలిస్తే దాతల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని గుర్తుచేస్తోంది. భారతదేశంలో అవయవ దానానికి అతిపెద్ద అడ్డంకి కేవలం అవగాహన లోపమే కాదు. అనేక ఆసుపత్రుల్లో మెదడు మరణాన్ని సకాలంలో గుర్తించే విధానాలు పూర్తిగా అమలులో లేకపోవడం, ప్రతి ఐసీయూలో ప్రత్యేక శిక్షణ పొందిన ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్లు లేకపోవడం, కుటుంబ సభ్యులకు సరైన సమయంలో శాస్త్రీయంగా మరియు సానుభూతితో కౌన్సిలింగ్ అందించకపోవడం, మతపరమైన అపోహలు, అవయవాల అక్రమ వ్యాపారంపై ఉన్న భయాలు, సమన్వయ వ్యవస్థలో ప్రాంతీయ అసమానతలు వంటి అనేక అంశాలు కలిసి దాతల సంఖ్యను ప్రభావితం చేస్తున్నాయి.

అందువల్ల అవయవ దానాన్ని కేవలం ప్రజా ప్రచార కార్యక్రమంగా కాకుండా, ఆరోగ్య వ్యవస్థలో ఒక కీలక విధాన అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఇప్పటికే జీవందాన్ ద్వారా దేశానికి మార్గదర్శక రాష్ట్రంగా నిలిచింది. ఇప్పుడు తదుపరి దశలో “తెలంగాణ అవయవ దాన మిషన్-2030” వంటి సమగ్ర కార్యాచరణను రూపొందించే సమయం ఆసన్నమైంది. ప్రతి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయి ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్ల నియామకం, ప్రతి ఐసీయూలో మెదడు మరణ గుర్తింపును తప్పనిసరి క్లినికల్ ప్రోటోకాల్గా అమలు చేయడం, ప్రతి మెడికల్ కళాశాలలో అవయవ దాన కౌన్సెలింగ్ యూనిట్ల ໖, ABHA Health ID, DigiLocker, MeeSeva ໖ డిజిటల్ ఆర్గన్ డోనర్ రిజిస్ట్ ఏర్పాటు, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇతర ప్రభుత్వ సేవల సమయంలో స్వచ్చంది అవయవ దాన ఎంపికను అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలవు. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలను “అవయవ దాన అవగాహన మాసం”గా ప్రకటించి విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరే ట్సంస్థలు, మీడియా, స్వచ్ఛంద సంస్థలు కలిసి నిరంతర ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తే సమాజంలో అవయవ దానంపై సానుకూల దృక్పథం మరింత బలపడుతుంది. భవిష్యత్లో సాంకేతికత కూడా ఈ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చగలదు. కృత్రిమ మేధస్సు ఆధారిత అవయవ సరిపోలిక (Al-assisted matching), దేశవ్యాప్త డిజిటల్ కేటాయింపు వ్యవస్థ, మెరుగైన అవయవ సంరక్షణ సాంకేతికత, వేగవంతమైన గ్రీన్ కారిడార్లు, ఆధునిక రవాణా వ్యవస్థలు మరింత సమర్ధవంతమైన అవయవ మార్పిడి సేవలకు దోహదపడతాయి. అయితే ఎంత ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నా, ఒక కుటుంబం తీసుకునే మానవతా నిర్ణయాన్ని ఏ యంత్రం భర్తీ చేయలేదనే విషయాన్ని మనం మరువకూడదు. అవయవ దానం అనేది కేవలం ఒక వైద్య ప్రక్రియ కాదు; అది మానవత్వం, దయ, సామాజిక బాధ్యత, జీవన విలువలకు ప్రతీక. ఒక దాత మరణాన్ని సమాజం ఆపలేకపోవచ్చు. కానీ ఆ దాత తీసుకున్న నిర్ణయం ద్వారా అనేక మంది జీవితాలను తిరిగి ప్రారంభించవచ్చు. భారతదేశం ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సలు చేయగల సామర్ధ్యాన్ని ఇప్పటికే నిరూపించింది. ఇప్పుడు ప్రపంచ స్థాయి అవయవ దాన సంస్కృతిని నిర్మించాల్సిన సమయం వచ్చింది. ఆ మార్పు ప్రభుత్వ విధానాలతో ప్రారంభమైనా, అది ప్రతి కుటుంబ నిర్ణయంతోనే సంపూర్ణమవుతుంది. మరణం జీవితానికి ముగింపు కావచ్చు; కానీ అవయవ దానం మరొకరి జీవితానికి నూతన ఆరంభం. ఒక దాత… అనేక ప్రాణాలకు ఆశ. ఒక నిర్ణయం… ఎన్నో కుటుంబాలకు కొత్త జీవితం.

డా. దసరపు శ్రీనివాస్
లాపరోస్కోపిక్ & మినిమల్ యాక్సెస్ సర్జన్ Apollo DRDO Hospital, Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *