భారతీయ కళలు సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని ఒకే వేదికపై చూపించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంగీత నృత్య సదస్సును నిర్వహించినట్లు విపంచి సంస్థ అధ్యక్షులు మహీంద్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు త్రిపురనేని తెలిపారు.
రెండు రోజుల సదస్సు దిగ్విజయం అయ్యిందని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు అద్భుత ప్రదర్శనలు, అభినయ ఉపన్యాసాలు చేశారని అభినందించారు. విపంచి సంస్థ 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శిల్పకళా వేదికలో రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సు ఆదివారం ఘనంగా ముగిసింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పలువురు కళాకారులు పరిశోధకులను సత్కరించారు.
ముగింపు సభలో డాక్టర్ రాజారావు త్రిపురనేని మాట్లాడుతూ కళలు మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను ఇస్తాయని, కళల పట్ల యువతను ఆకర్షించాలనే అంతర్జాతీయ సదస్సు లక్ష్యం నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. కళలతో సమాజాభివృద్ధి జరుగుతుందని, కళా సంపదను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తొలుత హైదరాబాద్ కు చెందిన ప్రముఖ భరత నాట్యం గురు డాక్టర్ హరి మంగళంపల్లి తన ఐదుగురు కుమార్తెలు హరిణి, హన్సిక, హంసిక, స్వాంతమయి, విశాఖ లతో కలసి చేసిన భరత నృత్యాంశాలు అలరించాయి.
నాట్యగురు నేహా సింగ్ చేసిన నాట్యం ఆకట్టుకుంది. 32 మంది ఆరభి మ్యూజిక్ స్కూల్ విద్యార్థులు కళారత్న డాక్టర్ అశోక్ గుర్జాలే సంగీత దర్శకత్వంలో ప్రదర్శించిన వయోలిన్ సింఫనీ ఈ సదస్సుకు సంపూర్ణతను చేకూర్చింది. చెన్నై కీ బోర్డు కళాకారుడు కలైమామణి డాక్టర్ కె. సత్యనారాయణన్ చేసిన కీ బోర్డు విన్యాస ప్రదర్శన ప్రేక్షకులను కట్టి పడేసింది. సంగీత స్వరాల మహత్తు గురించి ఆయన చేసిన ఉపన్యాసం స్ఫూర్తినిచ్చింది. ముంబయి నుంచి వచ్చిన సీనియర్ కళాకారిణి డాక్టర్ రాజ్యలక్ష్మి సేథ్ కూచిపూడి విలక్షణ అంశాలను ప్రస్తావిస్తూ జతి, శబ్ద పల్లవి, ఆరోహణ, అవరోహణ తదితర అంశాలను వివరిస్తుండగా ఔరంగాబాద్ కు చెందిన తన శిష్యులు బధిర కళాకారిణి లహరి పెద్దింటి, స్వరాళి భూపేష్ నర్తించారు. డాక్టర్ శైలజా దేశాయ్ బృందం కూచిపూడి (ముంబయి), అర్చన మిశ్రా కథక్ (కోల్ కతా), సోనాలి మొహంతి ఒడిస్సి (భువనేశ్వర్) నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
మలేషియాకు చెందిన నాట్య గురు గీత గోవర్ధనం హజారే తన శిష్య బృందంతో కలసి ఆంధ్ర నాట్యం అద్భుతంగా ప్రదర్శించి కరతాళధ్వనులు అందుకున్నారు. రెండు రోజుల పాటు వ్యాఖ్యాతగా వ్యవహరించి రక్తి కట్టించిన కళారత్న గాయత్రిరావును ఘనంగా సత్కరించారు. డాక్టర్ రాజారావు త్రిపురనేని, కేంద్ర సంగీత నాటక అకాడమి సభ్యురాలు డాక్టర్ ఎస్. పి. భారతి, లయన్ పద్మావతి, డాక్టర్ శైలజా దేశాయ్ సమన్వయం చేశారు.
