Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

సౌభాగ్య వ్యవసాయ విధానంతో రైతులకు అధిక ఆదాయం సాధ్యం: ఎం. విజయ రామ్

హైదరాబాద్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అవసరానికి మించి వరి సాగు జరుగుతోందని, ఒకే పంటపై ఆధారపడే మూస ధోరణి వ్యవసాయం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆర్గానిక్ వ్యవసాయ నిపుణుడు, ఎంరాల్డ్ వ్యవస్థాపకులు ఎం. విజయ రామ్ పేర్కొన్నారు. రైతు కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డిలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో అమలవుతున్న వివిధ వ్యవసాయ విధానాలు, ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా విజయ రామ్ మాట్లాడుతూ, తెలంగాణలో ప్రతి జిల్లాలో భూమి స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, అందువల్ల ప్రాంతాల వారీగా పంటల ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పాత జిల్లాల నమూనాను దృష్టిలో ఉంచుకుని సహజ వనరులకు అనుగుణంగా వ్యవసాయం చేస్తే రైతులకు మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు.

ఒకే పంట విధానం రైతులకు ఆర్థికంగా నష్టాలను మిగులుస్తోందని, పంజాబ్, హర్యానా తరహా ఏకపంట సంస్కృతి తెలంగాణలోనూ పెరగడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. యువత కూడా వ్యవసాయ రంగంలోకి వస్తున్న నేపథ్యంలో సంప్రదాయ సాగు విధానాలకు బదులుగా ఆదాయాన్ని పెంచే ఆధునిక సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.

సౌభాగ్య వ్యవసాయ విధానంలో ప్రతి రైతు తన భూమిలో కనీసం 10 శాతం విస్తీర్ణంలో చెరువును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో భూగర్భ జలాలు పెరుగుతాయని, బోర్లు ఎండిపోకుండా ఉంటాయని, నీటి కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వివరించారు. చెరువులకు ప్లాస్టిక్ షీట్లు వేయకుండా సహజ పద్ధతిలో నిర్మించాలన్నారు.

ఈ విధానంలో డీజిల్ వినియోగం గణనీయంగా తగ్గడంతో పాటు ట్రాక్టర్లపై ఆధారపడాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉండదని చెప్పారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా కేవలం ఒక దేశీ ఆవుతోనే సహజ వ్యవసాయం విజయవంతంగా చేయవచ్చని తెలిపారు.

తాను దేశవ్యాప్తంగా సహజ వ్యవసాయ నిపుణుడు పాలేకర్‌తో కలిసి పలు రాష్ట్రాల్లో పర్యటించి అనుభవం సంపాదించినట్లు వెల్లడించిన విజయ రామ్, ప్రస్తుతం “సౌభాగ్య వ్యవసాయ విధానం” పేరుతో ఐదు లేయర్ల నమూనాలో వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. ఒకే ఎకరాలో మునగ, అరటి, బొప్పాయి, కొబ్బరి, నిమ్మ, దానిమ్మ వంటి పండ్ల చెట్లతో పాటు అంతర్ పంటలుగా పసుపు, వివిధ రకాల ఆకుకూరలను సాగు చేయవచ్చని చెప్పారు. ఈ విధానంలో భూమిని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు ఏడాది పొడవునా వివిధ పంటల ద్వారా రైతుకు నిరంతర ఆదాయం లభిస్తుందని వివరించారు.

వికారాబాద్, కృష్ణా జిల్లాల్లో వంద ఎకరాలకు పైగా ఈ నమూనాలో విజయవంతంగా సాగు చేస్తున్నామని పేర్కొన్న ఆయన, ఈ విధానంలో ఆర్గానిక్ వ్యవసాయం చేపడితే రైతు సంవత్సరానికి కనీసం రూ.5 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.

విజయ రామ్ సూచించిన సౌభాగ్య వ్యవసాయ విధానం పట్ల ఆసక్తి వ్యక్తం చేసిన రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఒక ఎకరా విస్తీర్ణంలో ఈ నమూనాను అమలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా సౌభాగ్య వ్యవసాయ విధానం ఫలితాలను ప్రత్యక్షంగా రైతులకు చూపించడంతో పాటు, దానిని పరిశీలించిన ఇతర రైతులు కూడా ఈ విధానాన్ని అనుసరించే అవకాశం ఉంటుందని సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిపారు.

రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు సహజ వనరుల పరిరక్షణకు దోహదపడే సౌభాగ్య వ్యవసాయ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *