సికింద్రాబాద్, 1 సెప్టెంబర్, 2026 : సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ మహోత్సవం – 2026 కార్యక్రమానికి శ్రీమతి డాక్టర్ జె. స్వప్న, సీడీపీఓ, సికింద్రాబాద్ ప్రాజెక్టు హాజరయ్యారు.
ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి డా. జె. స్వప్న మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని అన్నారు. యువత తమ రోజువారీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పోషక విలువలు కలిగిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుత కాలంలో యువత జంక్ ఫుడ్, అధిక చక్కెర కలిగిన పానీయాల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, వాటిని పరిమితం చేసి ఇంట్లో లభించే పప్పులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మరియు ఇతర పోషకాహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలని తెలిపారు. మత్తు పదార్థాలు జోలికి ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని, వాటి నుండి మన స్నేహితులను చుట్టుపక్క వారిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
“కడుపు నిండటం మాత్రమే కాదు… శరీరానికి అవసరమైన పోషకాలు అందడం ముఖ్యం” అని ఆమె పేర్కొన్నారు.
పోషణపై అవగాహనను ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా యువతకు చేరవేయడంలో యువతే కీలక పాత్ర పోషించగలరని అన్నారు. తాము తెలుసుకున్న పోషకాహార విషయాలను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సమాజంలోని ఇతరులకు తెలియజేయడం ద్వారా పోషణ సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా స్థానికంగా అందుబాటులో ఉండే “లో కాస్ట్ నో కాస్ట్” పదార్థాలతో తయారు చేసిన పోషకాహార రిసిపీల ప్రదర్శన ఉంచి, వాటి పోషక విలువలు మరియు తయారీ విధానాన్ని వివరించారు.
యువత ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, బలమైన సమాజం, అభివృద్ధి చెందిన దేశం నిర్మాణం సాధ్యమవుతుందని డా. జె. స్వప్న తెలిపారు.
ఈ కార్యక్రమంలో అందరి చేత “పోషణ ప్రతిజ్ఞను” చేయించారు.
