పాఠశాల నుంచి అంతర్జాతీయ క్రీడా వేదికల వరకు క్రీడాకారుల అభివృద్ధికి సమగ్ర వ్యవస్థ అవసరం
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్
హైదరాబాద్, సెప్టెంబర్ 3:
అమెరికాలోని నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) నమూనాలో తెలంగాణలో సమగ్ర కాలేజియేట్ క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేసే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (క్రీడలు) శ్రీ జయేష్ రంజన్, ఐఏఎస్ తెలిపారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG), హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ సహకారంతో గురువారం గచ్చిబౌలి క్రీడా సముదాయంలో ఎన్సీఏఏ మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (పాలసీ అండ్ గవర్నెన్స్) శ్రీ కెవిన్ లెన్నన్తో రెండు ప్రత్యేక అవగాహన,పరస్పర చర్చా సమావేశాలను నిర్వహించింది. క్రీడా, విద్యా రంగాలకు చెందిన 125 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఎన్సీఏఏలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీ కెవిన్ లెన్నన్, అమెరికా కాలేజియేట్ క్రీడా వ్యవస్థలోని పాలనా విధానం, క్రీడాకారుల అభివృద్ధి, విద్యా అర్హతల ప్రమాణాలు, స్కాలర్షిప్ వ్యవస్థ, విద్యాసంస్థల భాగస్వామ్య నమూనాలపై తన అనుభవాలను పంచుకున్నారు.
“అమెరికన్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ నుంచి పాఠాలు – తెలంగాణ క్రీడా భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్” అంశంపై నిర్వహించిన తొలి సమావేశంలో రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, క్రీడా సంఘాలు, క్రీడాకారుల అభివృద్ధి సంస్థలు, క్రీడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు.
పాఠశాల క్రీడలు, విశ్వవిద్యాలయ స్థాయి పోటీలు, ప్రతిభావంతులైన క్రీడాకారుల అభివృద్ధిని అనుసంధానించే సమగ్ర వ్యవస్థ రూపకల్పనపై చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీ జయేష్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణలో అపారమైన క్రీడా ప్రతిభతో పాటు ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ క్రీడలు, అక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ పోటీల వరకు క్రీడాకారులు క్రమబద్ధంగా ఎదిగే విధంగా ఒక సమర్థవంతమైన వ్యవస్థ అవసరమని అన్నారు. తెలంగాణకు అనువైన కాలేజియేట్ క్రీడా నమూనా రూపకల్పనలో అమెరికా కాన్సులేట్ జనరల్, క్రీడా మరియు విద్యా రంగాల భాగస్వామ్య సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
“ఎన్సీఏఏ మరియు కాలేజియేట్ క్రీడా నమూనా అవగాహన” అంశంపై నిర్వహించిన రెండో సమావేశంలో కోచ్‌లు, క్రీడా నిర్వాహకులు, రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులు, ప్రైవేట్ అకాడమీలు, క్లబ్‌లు, శారీరక విద్య నిపుణులు పాల్గొన్నారు. ఎన్సీఏఏ పరిపాలనా నిర్మాణం, క్రీడాకారుల సంక్షేమం, విద్యా ప్రగతి, ప్రతిభా గుర్తింపు, స్కాలర్షిప్ విధానాలు, క్రీడా నిర్వహణలో అనుసరించే ఉత్తమ పద్ధతులపై శ్రీ కెవిన్ లెన్నన్ వివరించారు.
తెలంగాణ ప్రభుత్వ క్రీడా సలహాదారు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ ఎ.పి. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ కాలేజియేట్ క్రీడా వ్యవస్థ విజయవంతం కావాలంటే క్రీడా సంఘాలు, అకాడమీలు, విద్యాసంస్థలు, కోచ్‌ల మధ్య సమన్వయం అత్యంత కీలకమని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ఎన్సీఏఏ నమూనాలో పాఠశాల, కళాశాల మరియు విశ్వవిద్యాలయ క్రీడలను అనుసంధానించే సమగ్ర క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరంపై సమావేశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ మేరకు వివిధ వర్గాల భాగస్వాములతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వ పరిశీలన కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధంi చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎ. సోనిబాలా దేవి, ఐఎఫ్ఎస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహణలో సహకరించిన అమెరికా కాన్సులేట్ జనరల్, హైదరాబాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ క్రీడా పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 2036 ఒలింపిక్ క్రీడల లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర క్రీడాకారుల అభివృద్ధికి అవసరమైన కార్యాచరణలను రూపొందించేందుకు స్పోర్ట్స్ అథారిటీ చర్యలు చేపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఒలింపియన్ సైనా నెహ్వాల్, ఒలింపియన్ సత్తి గీత, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇస్మాయిల్ బేగ్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ టి. మల్లారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఉన్నతాధికారులు, విద్యాసంస్థలు, క్రీడా సంఘాలు, అకాడమీలు మరియు ఇతర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
