తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భావజాల వ్యాప్తికర్త, ఆచార్య జయశంకర్ 92వ జయంతి వేడుకలను గురువారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్, మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంఎల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, ఎల్వీ రమణ, తకెళ్ళపల్లి రవీందర్ రావు, అంజిరెడ్డి, ప్రముఖ మేధావి ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భావాజాల వ్యాప్తికి కృషి చేసి ప్రజల గుండెలో ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా నిలిచిపోయిరని కొనియాడారు.
ప్రముఖ వక్తలు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి, అందించిన వైచారిక మార్గదర్శకత్వం చిరస్మరణీయమని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నలుమూలలకూ వ్యాప్తి చేయడంలోనూ, మలిదశ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా దిశానిర్దేశం చేయడంలోనూ ఆయన పాత్ర అమూల్యమైనదని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ ఇంచార్జ్ సహాయ సంచాలకుడు పి. నర్సింలు, ఏఓ డా. పి. విజయకుమార్, సలహా మండలి సభ్యులు దినకర్, భాషా సాంస్కృతిక శాఖ అధికారులు, సిబ్బంది మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటలు పాడి అలరించారు.
