వికారాబాద్ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో వికలాంగుల ఉద్యమం మరోసారి ఉధృతమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ గడ్డపై గర్జించిన గిద్దె రాజేష్, మంగళవారం సంఘం నాయకులు, కార్యకర్తలతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఉన్న తాండూర్–వికారాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వికలాంగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల సమస్యలను విస్మరించడం సరికాదని అన్నారు.
ఎన్నికల సమయంలో వికలాంగుల పెన్షన్లను రూ.6,000కు పెంచుతామని, వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రా సిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, ప్రభుత్వ శాఖల్లో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గిద్దె రాజేష్ గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చిన మాటలుగా మిగిలిపోకూడదని, వికలాంగులు కూడా ఈ రాష్ట్రానికి సమాన హక్కులు కలిగిన పౌరులేనని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ బాధ్యత అని, ఇచ్చిన హామీలతోపాటు రాష్ట్రంలో వికలాంగుల అభ్యున్నతికై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.10 లక్షలతో ‘వికలాంగుల బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టి ఆసరా పింఛను వచ్చే ప్రతి వికలాంగునికి వికలాంగుల బంధు వర్తింపజేయడంతోపాటు, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వికలాంగులకు ఉన్న 5 శాతం రిజర్వేషన్ను 100 శాతానికి పెంచి, ఆసరా పింఛన్ పొందుతున్న ప్రతి అర్హత కలిగిన వికలాంగులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, రాష్ట్రంలో వెంటనే నూతన పింఛన్లు విడుదల చేయాలని గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకుంటే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై దండయాత్ర చేపట్టి, కొడంగల్లో లక్ష మందితో ‘వికలాంగుల ఆవేదన సభ’ నిర్వహిస్తామని గిద్దె రాజేష్ ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు, సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పసుల చంద్రయ్య, సంఘం రాష్ట్ర నాయకులు, వికారాబాద్ జిల్లా ఇంచార్జ్ పోతురాజు సుధీర్, సంఘం రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యవర్గ సభ్యులు కడియ నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం. చుక్కయ్య, పరిగి డివిజన్ నాయకులు లక్ష్మయ్య, సంఘం నూతన నాయకులు బొంపల్లి ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, నారాయణ, జంగయ్య, యాదయ్య, జే. రాములు, మహిళా నాయకురాళ్లు లక్ష్మి, భాగ్యమ్మ, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉరడి హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.
