సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప వీరుడు, ధైర్యసాహసాలకు ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ, జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా “మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ*.. సర్వాయి పాపన్న గౌడ్ కేవలం ఒక యోధుడు మాత్రమే కాదని, అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాన్య ప్రజల గౌరవం కోసం పోరాడిన ప్రజా నాయకుడని పేర్కొన్నారు. తన కాలంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటూ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారని అన్నారు.
ప్రజల కోసం పోరాడాలి.. అన్యాయాన్ని ఎదిరించాలి.. సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పాలి అనే స్ఫూర్తిని సర్వాయి పాపన్న గౌడ్ తన జీవితంతో చాటిచెప్పారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత నేటి తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.
చరిత్రలో ఎన్నో గొప్ప పోరాటాలు జరిగినప్పటికీ, పలువురు మహనీయులకు తగిన గుర్తింపు లభించలేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి మహనీయుల చరిత్రను వెలుగులోకి తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు అందించడంతో పాటు, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
జయంతి ఉత్సవాలు కేవలం వేడుకలకే పరిమితం కాకూడదని, మహనీయుల ఆశయాలను జీవితంలో ఆచరించడమే వారికి అందించే నిజమైన నివాళి అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యువత సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను అధ్యయనం చేయాలని, ఆయన చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, నాయకత్వ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రామరావు గౌడ్, అరుణ్ గౌడ్, నర్సింగం గౌడ్, తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
