TIMS (టిమ్స్) హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కలిసి ఆపరేషన్ థియేటర్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ వి. నవీన్ యాదవ్ గారు.
నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్లో, ఈఎస్ఐ ఆసుపత్రి ఎదురుగా నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) వెయ్యి పడకల ఆసుపత్రిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ గారు, వైద్యశాఖ అధికారులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వైద్య విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం సభా వేదికపై ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ప్రసంగిస్తూ, నాడు యూసుఫ్‌గూడ గ్రామంగా ఉన్న ప్రాంతంలో, నేడు ఎర్రగడ్డగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రి ఏర్పాటు కావడం ఎంతో ఆనందదాయకమని అన్నారు.
ఈ ఆసుపత్రి కేవలం ఈ ప్రాంత ప్రజలకే కాకుండా, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన టిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో ప్రజలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువ కానుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంతటి ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థను ఏర్పాటు చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
