రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్‌గా వికలాంగుడినే నియమించాలని, లేకుంటే రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నివాసాన్ని ముట్టడించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా దండయాత్ర చేపడతామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హెచ్చరించారు.
బుధవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు అధ్యక్షతన నిర్వహించిన సంఘం గ్రామ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్‌గా సకలాంగుడిని నియమిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
వికలాంగుల సమస్యలను ప్రత్యక్షంగా అనుభవించిన వికలాంగులకే వాటిపై సంపూర్ణ అవగాహన ఉంటుందని, అందువల్ల రాష్ట్రంలో వికలాంగుల హక్కుల చట్టం–2016 సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్‌గా వికలాంగుడినే నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీల మేరకు వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచాలని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, రాష్ట్రంలోని వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీలో చట్టం చేయాలని, ఆ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీల సాధన కోసం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేసి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నివాసంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్‌ను ముట్టడించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధమైన దండయాత్ర నిర్వహిస్తామని గిద్దె రాజేష్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మున్నా మధు యాదవ్, రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి తదితరులు పాల్గొన్నారు.
