తేదీ: 03-09-2026 స్థలం: కలెక్టర్ కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం (ఉమ్మడి ఖమ్మం) జిల్లాల పరిధిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ అంశాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, సర్వే–రీ సర్వే, కేడస్ట్రల్, నాన్ కేడస్ట్రల్ గ్రామాల సమస్యలు, రెవెన్యూ–అటవీ శాఖల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలపై గురువారం సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై, రెండు జిల్లాల పరిధిలోని వివిధ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై జిల్లా అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ప్రజలకు సంబంధించిన భూ సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసే దిశగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కరించాలని, నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా గ్రామాల వారీగా సర్వే–రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కేడస్ట్రల్, నాన్ కేడస్ట్రల్ గ్రామాలకు సంబంధించిన భూ రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని మంత్రి సూచించారు. రెవెన్యూ మరియు అటవీ శాఖల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పరిశీలించి, వాస్తవ పరిస్థితులను గుర్తించి సమస్యలకు పరిష్కారం చూపాలని తెలిపారు. భూములకు సంబంధించిన సమస్యల కారణంగా సామాన్య ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, పినపాక నియోజకవర్గ పరిధిలో రెవెన్యూ, అటవీ సరిహద్దులు, సర్వే–రీ సర్వేకు సంబంధించిన సమస్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములకు సంబంధించిన సమస్యల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
పినపాక నియోజకవర్గంలోని కేడస్ట్రల్, నాన్ కేడస్ట్రల్ గ్రామాల్లో సర్వే–రీ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు పేర్కొన్నారు. రెవెన్యూ–అటవీ సరిహద్దులకు సంబంధించి ప్రజలకు స్పష్టత కల్పించడంతో పాటు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ప్రజల భూ హక్కులు, భూ రికార్డుల విషయంలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు సూచించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రెవెన్యూ, అటవీ శాఖలకు సంబంధించిన సరిహద్దు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
సమావేశంలో రెండు జిల్లాల పరిధిలోని రెవెన్యూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పరిస్థితి, సర్వే–రీ సర్వే పురోగతి, కేడస్ట్రల్, నాన్ కేడస్ట్రల్ గ్రామాల వివరాలు, రెవెన్యూ–అటవీ సరిహద్దు వివాదాలపై అధికారులు సమగ్ర వివరాలను మంత్రికి, ఎమ్మెల్యేలకు వివరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు కునంనేని సాంబశివరావు గారు, జారే ఆదినారాయణ గారు, కోరం కనకయ్య గారు, రామ్‌దాస్ నాయక్ గారు, తెల్లం వెంకట్రావు గారు, మట్టా రఘమయి గారు, జిల్లా కలెక్టర్, ఐటిడిఏ పీఓ, జిల్లా ఎస్పీతో పాటు ఖమ్మం జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
