ప్రకటన న్యూస్ ప్రతినిధి బి. అనిత
హైదరాబాద్, 20 జూలై, 2026 : అసెంబ్లీ ఎన్నికల హామీలు అమలు చేసి రాజ్యాధికారంలో వికలాంగుల వాటా ఖరారు చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పెన్‌పహాడ్ మండల సమావేశంలో వెల్లడి
పెన్‌పహాడ్, జూలై 15: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఆ తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు.
బుధవారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయినా అసెంబ్లీలో వికలాంగుల సమస్యలపై కనీస స్థాయిలో కూడా సమగ్ర చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు.
సకలాంగుల రాజకీయ ప్రజాప్రతినిధులు వికలాంగుల సమస్యలను చట్టసభల్లో సమర్థంగా ప్రస్తావించకపోవడం వల్లే వికలాంగుల హక్కులు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన అనేక కీలక అంశాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు. అందువల్ల వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించి, వారి ప్రతినిధులకు చట్టసభల్లో అవకాశం కల్పించడం అత్యవసరమని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల సామాజిక భద్రతా పెన్షన్‌ను వెంటనే రూ.6,000లకు పెంచాలని, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో 100 శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా–శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని, వికలాంగుల హక్కుల చట్టం–2016ను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న నూతన పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీలో ఒక మహిళా వికలాంగురాలికి, ఒక పురుష వికలాంగుడికి కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించాలని, రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు ప్రాతినిధ్యం ఇచ్చి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుడినే మంత్రిగా నియమించాలని కోరారు.
వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించి, అసెంబ్లీ ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసి రాజ్యాధికారంలో వికలాంగుల వాటాను ఖరారు చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గిద్దె రాజేష్ హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే లక్షలాది మంది వికలాంగులతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు పేర్ల సోమయ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు కొండ సైదులు యాదవ్, మున్న మధు యాదవ్, కోమటిరెడ్డి కృష్ణారెడ్డి, గార్లపాటి వెంకటరెడ్డి, గుండు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
